Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్‌బై.. మెగా డాటర్ ఏం చెప్పారంటే..!
- మంత్రిగా ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బిజీ అవుతారంటూ వార్తలు
- ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని వదంతులు
- తాజాగా ఇదే ప్రశ్న మెగా డాటర్ సుష్మిత కొణిదెలకు ఎదురైన వైనం
- పవన్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పితే గుడ్‌బై చెప్పరని సుష్మిత క్లారిటీ
ఏపీలో కూటమి విజయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పవన్ సమయస్ఫూర్తితోనే ఈసారి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంత కీలకంగా మారారనే అనే విషయం అందరికీ తెలిసింది. దీంతో పవన్‌కు తాజాగా ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖను అప్పగించి సమూచిత స్థానం కల్పించారు చంద్రబాబు నాయుడు.
ఇదిలాఉంటే.. ఇప్పుడు పవన్ మంత్రి కావడంతో ఇకపై పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని, సినిమాలకు గుడ్‌బై చెబుతారనే వదంతులు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆయన చాలా చేయాల్సి ఉంది. అందుకే పవర్ స్టార్ ఇక సినిమాల నుంచి తప్పుకుంటారనే వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఇదే ప్రశ్న మెగా డాటర్ సుష్మిత కొణిదెలకు ఎదురైంది.
ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న మూడు చిత్రాలు (ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, వీరమల్లు) పూర్తి చేసి తర్వాత కొత్త మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా సినిమాలకు వీడ్కోలు పలుకుతారని బయట వస్తున్న వార్తలు నిజం అవుతాయా అని సుష్మితను ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. 'బాబాయ్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పితే వందకు వందశాతం గుడ్‌బై చెప్పరు. ఆయన సినిమాలు చేయడం మానేస్తే అది అభిమానులకు గుండె పగిలే వార్త అవుతుంది' అన్నారు.
ఇక ఎన్నో అవమానాల తర్వాత రాజకీయాల్లో నిలదొక్కున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే అభిమానులు ఖుషీ అవుతారు. ఆయన రాష్ట్రంలో చేసే మంచి పనులు చేసి అందరూ మెచ్చుకోవాలి అని సుష్మిత కొణిదెల చెప్పుకొచ్చారు.