PM Giorgia Meloni: మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సెల్ఫీ.. నెట్టింట ఫొటో వైరల్!
- ఇటలీలో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ
- ఇటలీ ప్రధాని మెలోనీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న మోదీ
- ఈ సందర్భంగా మోదీతో సెల్ఫీ దిగిన జార్జియా మెలోని
- గతేడాది దుబాయిలో జరిగిన కాప్28 సదస్సు సందర్భంగా కూడా మెలోని, మోదీ సెల్ఫీ
ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 దేశాల సమావేశాలకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ఇండియా వచ్చేశారు. అయితే, మోదీతో నిన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగుతూ ఇద్దరు దేశాధినేతలు ఫుల్ స్మైల్ ఇచ్చుకున్నారు. ఆ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక జీ7 శిఖరాగ సదస్సు సందర్భంగా మెలోనీతో ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
కాగా, గతేడాది దుబాయిలో జరిగిన కాప్28 సదస్సు సందర్భంగా కూడా మెలోని, మోదీ సెల్ఫీ దిగారు. ఆ ఫొటో కూడా బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్‌లో భాగంగా ఇటలీ వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీ వెళ్లడం జరిగింది. ఇద్దరూ రక్షణ, భద్రతా సహకారంపై చర్చించారు.
మెలోనితో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సహా అనేక మంది ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
ఇక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జపాన్ ప్రధాని కిషిదాతో మోదీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పరస్పరం, ప్రాంతీయ ప్రయోజనాలపై చర్చించినట్లు సమాచారం.
అటు జీ7 సదస్సులో కెనడా ప్రధాని ట్రూడోతోనూ మోదీ భేటీ అయ్యారు. గత ఏడాది కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో పేర్కొన్న తర్వాత వారు ముఖాముఖిగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కాగా, ఈ కేసుకు సంబంధించి నలుగురు భారతీయులను కెనడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.