Komatireddy Venkat Reddy: ఆ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది: మంత్రి కోమటిరెడ్డి
- తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందన్న మంత్రి
- బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని జోస్యం
- కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి హౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా
- కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్న చూపు చూశారని విమర్శ
బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని... హరీశ్ రావుకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య గురించి పట్టించుకోలేదన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేశారని విమర్శించారు.
కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్న చూపు చూశారన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము ఆగస్ట్ 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు.