Balka Suman: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్సే కాదు... ఏపీలో వైసీపీదీ అదే పరిస్థితి: బాల్క సుమన్

Balka Suman clarifies why brs not won a single seat in lok sabha polls
  • రెండు కూటముల మధ్య పోటీగానే దేశ ప్రజలు చూశారన్న సుమన్
  • ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, యూపీలో బీఎస్పీ కూడా ఏ కూటమిలో లేవని వెల్లడి
  • పేరుకే ప్రజా పాలన... కానీ ప్రతీకార పాలన సాగిస్తున్నారని ఆగ్రహం
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రెండు కూటముల మధ్య పోటీగానే చూశారని... అందుకే బీఆర్ఎస్‌కు సీట్లు రాలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇటు ఎన్డీయే, అటు ఇండియా కూటములలో లేని పార్టీలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. ఏ కూటమిలో లేని మూడు నాలుగు పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో వెనుకబడినట్లు చెప్పారు. ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఏ కూటములలో లేవని... ఆ పార్టీలకు కూడా నిరాశాజనక ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలోనూ అదే ఫలితం వచ్చినట్లుగా భావిస్తున్నామన్నారు. అయినప్పటికీ ఉద్యమ పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.

పగ, ప్రతీకార పాలన సాగిస్తున్నారు

తెలంగాణలో పేరుకే ప్రజాపాలన అంటున్నారని... కానీ పగలతో, ప్రతీకారంతో కూడిన పాలనను సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎంతసేపూ కేసీఆర్‌పై విషం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్వేషాన్ని రగిల్చే కుట్ర తప్ప మరొకటి లేదన్నారు. ప్రజలు అవకాశమిచ్చినందుకు ఏం చేద్దామనే ఆలోచన వారికి ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇందుకు పాఠ్యపుస్తకాలను వెనక్కి తెప్పించడమే నిదర్శనమన్నారు.

పాఠ్యపుస్తకాలపై నాటి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డిల పేర్లు ఉన్నందుకు వాటిని వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక స్కూల్ పుస్తకాలపై జయలలిత ఫొటో ఉంటే ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదని గుర్తు చేశారు. ఒకవేళ కేసీఆర్ ఫొటో ఉండటం ఇబ్బందికరమైతే వేసవికాలంలోనే సమీక్ష నిర్వహించవలసి ఉండాల్సిందన్నారు. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక విద్యార్థుల్ని, పిల్లల్ని ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పట్టపగలు హత్య జరిగిందని... ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో పసిపాపను తీసుకెళ్లి అత్యాచారం చేశారని, హైదరాబాద్‌లో గంజాయి మూకలు స్వైరవిహారం చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారన్నారు. గంజాయి మూకల స్వైరవిహారం, హత్యలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో రేవంత్ రెడ్డి ఈ విశ్వనగరాన్ని కాస్తా విషాద నగరంగా చేశారని విమర్శించారు.
Balka Suman
BRS
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News