Chandrababu: అధికారంలో ఉన్నామని కక్ష సాధింపు చర్యలు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దు: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు హితవు
- టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేసిన చంద్రబాబు
- ఎమ్మెల్యేలు, నేతలు దిగువస్థాయి కార్యకర్తలను విస్మరించరాదని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు నేడు టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గత 20 ఏళ్లలో గెలవని చోట కూడా ఈసారి విజయం సాధించామని సంతోషం వ్యక్తం చేశారు.
కూటమి 93 శాతం స్ట్రయిక్ రేట్ తో 57 శాతం ఓట్ షేర్ సాధించిందని వివరించారు. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని వెల్లడించారు. ఎన్నికల్లో మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. ఇంతటి ఘనవిజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.
ఐదేళ్ల పాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. అయితే, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని కక్ష సాధింపు చర్యలు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దని క్యాడర్ కు చంద్రబాబు హితవు పలికారు. అదే సమయంలో... ఎమ్మెల్యేలు, నేతలు కిందిస్థాయి కార్యకర్తలను విస్మరించకూడదని స్పష్టం చేశారు. బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారని సూచించారు.
ఇక, గతంలో ఏర్పాటు చేసిన చోటే మరో 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని అన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరు, ఎక్కడ, ఏ విధంగా సేవలు అందించారో, ఏ మేరకు పనిచేశారో అధ్యయనం చేసి పదవులు కేటాయిస్తామని చెప్పారు. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు.