Telugudesam: పంతంపట్టి చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వచ్చిన మహిళ!
- ఐదేళ్ల క్రితం అక్క కొడుకుతో రాజకీయంగా విభేదం
- చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే వస్తానన శపథం
- ఐదేళ్ల పాటు పుట్టింట్లో జరిగిన అన్ని కార్యక్రమాలకు దూరం
- నిన్న స్వగ్రామానికి వచ్చిన విజయలక్ష్మి
- బంధువులు, గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తల ఘన స్వాగతం
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే పుట్టింట్లో అడుగుపెడతానని భీష్మించిన ఓ మహిళ అనుకున్నట్టే ఐదేళ్ల తర్వాత కన్నవారి ఇంటికి చేరుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురానికి చెందిన విజయలక్ష్మికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావుతో వివాహమైంది. ఐదేళ్ల క్రితం తన ఇద్దరు కుమారులతో కలిసి కేశవాపురంలోని సోదరి ఇంటికి వచ్చారు. మాటల సందర్భంగా వచ్చేసారి చంద్రబాబే సీఎం అవుతారని విజయలక్ష్మి, జగనే మళ్లీ అధికారంలోకి వస్తారని అక్క కొడుకు ప్రసాద్ మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయ్యాకే మళ్లీ ఊళ్లో అడుగుపెడతానని సవాలు చేశారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయిన ఆమె ఐదేళ్లపాటు పుట్టింట్లో జరిగిన ఏ కార్యక్రమానికీ హాజరు కాలేదు. తాజా ఎన్నికల్లో టీడీపీ గెలిచి, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో విజయలక్ష్మి శనివారం స్వగ్రామానికి వచ్చారు. పంతం పట్టి చంద్రబాబు సీఎం అయ్యాక గ్రామానికి వచ్చిన విజయలక్ష్మికి కుటుంబ సభ్యులే కాదు, గ్రామస్థులు, టీడీపీ అభిమానులు స్వాగతం పలికారు. బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి విజయలక్ష్మి నివాళులు అర్పించి ఇంటికి వెళ్లారు.