Nadendla Manohar: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తొలిసారిగా తనిఖీలు.. బయటపడ్డ భారీ దోపిడీ!
- తెనాలిలోని నిల్వ గోదాముల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి తనిఖీలు
- కందిపప్పు, నూనె ప్యాకెట్లు బరువు 50 - 100 గ్రాములు తక్కువగా ఉన్నట్టు బయటపడ్డ వైనం
- వివరణ ఇచ్చుకోలేక నీళ్లు నమిలిన అధికారులు
- మంగళగిరి తనిఖీల్లోనూ ఇదే బాగోతం వెలుగులోకి
- వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలంటూ అధికారులకు మంత్రి ఆదేశం
ఏపీ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా చేపట్టిన తనిఖీల్లో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. తెనాలిలో నిల్వగోదాములు తనిఖీ చేయగా పంచదార, కందిపప్పు, నూనె.. తదితర ప్యాకెట్ల బరువు 50 - 100 గ్రాములు తక్కువగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. అనంతరం, మంగళగిరిలో చేసిన తనిఖీల్లోనూ ఇదే బాగోతం వెలుగు చూసింది. దీంతో, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దోపిడీపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది రాష్ట్రంలో బయటపడ్డ భారీ కుంభకోణమని అన్నారు.
ప్యాకెట్ల తూకంలో ఇంత తేడా ఉన్నా అదేమంత పెద్ద విషయం కానట్టు అధికారులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా? అన్నట్టు వ్యవహరించారట. ఒక్క తెనాలిలోనే ఇలా ఉందా? మిగితా చోట్ల కూడా ఇదే పరిస్థితా అన్న ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. దీంతో, మంత్రి మంగళగిరిలో తనిఖీలకు ఆదేశించగా అక్కడా ఇదే బాగోతం వెలుగు చూసింది.
రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల ద్వారా పేదలకు ఇచ్చే రేషన్.. నుంచి అంగన్‌వాడీ, వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తూకం ఒక్కటే కాకుండా, ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి సహకారంతోనే ఇష్టారాజ్యంగా ఐదేళ్లుగా ఈ దోపిడీ సాగుతోందట. పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనూ రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. డీలర్లకు సరఫరా చేసే బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోంది. ఒక్కో బస్తా 5 - 8 కిలోల వరకూ బరువు తక్కువగా ఉంటోందని, అయినా, అధికారుల బెదిరింపులు, వేధింపులతో డీలర్లు కిమ్మనకుండా ఉండిపోతున్నారట.