T20 World Cup 2024: స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ.. సూపర్-8కు ఇంగ్లండ్
- చివరి ఓవర్లో విజయం సాధించిన ఆసిస్
- 181 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించిన ఆస్ట్రేలియా
- ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్-8 దశలో అడుగుపెట్టింది. ఆదివారం స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా చివరి ఓవర్లో ఉత్కంఠ భరిత విజయం సాధించడంతో ఇంగ్లండ్‌కు మార్గం సుగమమైంది. తొలుత బ్యాటింగ్ చేసి స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. 49 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు బాదాడు. ఇక మార్కస్ స్టోయినిస్ 29 బంతుల్లో ఏకంగా 59 పరుగులు బాదాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ కీలక దశలో ఔట్ అయినప్పటికీ టిమ్ డేవిడ్ (24 పరుగులు) చివరి వరకు క్రీజులో ఉండి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్ చెరో 2 వికెట్లు, బ్రాడ్ వీల్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌కలమ్ 34 బంతుల్లో 60 పరుగులు బాదాడు. బెర్రింగ్ స్టోన్ 40, మున్సే 35 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు.
కాగా స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపుతో ఇంగ్లండ్‌కు కలిసి వచ్చి సూపర్-8 దశలో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లూ గెలిచిన ఆస్ట్రేలియా నాకౌట్ లో అడుగుపెట్టింది. ఇక ఇంగ్లండ్, స్కాట్లాండ్ చెరో 5 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్‌తో అర్హత సాధించింది.