AP Health Minister: ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అవకతవకలపై విచారణ జరిపిస్తాం: మంత్రి సత్యకుమార్
- క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం
- మారుమూల గ్రామానికి మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన
- ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధ్యాన్యం
- బాధ్యతలు స్వీకరించాక మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్
పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతున్న రోగులను ఆదుకోవడానికి తీసుకొచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఏపీ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఈమేరకు ఆదివారం ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మారుమూల గ్రామానికి సైతం మెరుగైన వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.
‘గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేసి, వైద్యంలో రాష్ట్రాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతాం. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఈ మహమ్మారి నివారణ కోసం చర్యలు తీసుకుంటాం. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తాం’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.