Jagan: హైదరాబాదులో జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం జీహెచ్ఎంసీ అధికారి బదిలీ
- నిన్న లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద కొన్ని కట్టడాల కూల్చివేత
- జోనల్ కమిషనర్ హేమంత్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్
- ఉన్నత అధికారుల ఆదేశాలు లేకుండానే కూల్చివేతలు...?
హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద నిన్న కొన్ని అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవరావును బదిలీ చేశారు. బోర్కాడే హేమంత్ సహదేవరావు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) వద్ద రిపోర్ట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.
జగన్ నివాసం వద్ద ఫుట్ పాత్ లను ఆక్రమించి సెక్యూరిటీ అవుట్ పోస్టులను నిర్మించారని, తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఈ కట్టడాలను కూల్చినట్టు తెలుస్తోంది.
ఈ కూల్చివేతలకు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోకుండానే ముందడుగు వేయడం పట్ల తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగణించింది. అయితే, లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మంత్రి నిర్దేశించిన మేరకే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ కూల్చివేతలకు ఉపక్రమించినట్టు సమాచారం.