Babar Azam: పాక్ కెప్టెన్సీని వదులుకోవడంపై నోరువిప్పిన బాబర్ ఆజమ్
- ఈ ఓటమికి ఏ ఒక్కరిదీ తప్పు కాదన్న బాబర్ ఆజమ్
- టీమంతా కలిసికట్టుగా ఆడలేకపోయిందని వ్యాఖ్య
- పీసీబీతో చర్చించాక కెప్టెన్సీ వదులుకోవడంపై ప్రకటిస్తానన్న బాబర్
బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ టీం ఇటీవల టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. పాక్ అభిమానులతో పాటు మాజీ క్రీడాకారులు కూడా బాబర్ ఆజమ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో, అతడి భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. బాబార్ కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. ఈ విషయమై బాబార్ తాజాగా స్పందించాడు.
‘‘2023లో కెప్టెన్సీ పదవిని వదులుకున్నప్పుడు నేను మళ్లీ రాకూడదని అనుకున్నా. అందుకే అప్పట్లో నేనే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించా. కానీ మళ్లీ నాకు వాళ్లు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రపంచకప్‌లో ఏం జరిగిందనేది నేను పాక్ క్రికెట్ బోర్డుకు వివరిస్తా. ఇక కెప్టెన్సీ వదులుకోవాల్సి వస్తే ఆ విషయాన్ని బహిరంగంగానే చెబుతా. ఏం జరిగినా పబ్లిక్‌గానే జరుగుతుంది. ప్రస్తుతానికైతే నేను కెప్టెన్సీ బాధ్యతలు వదులుకోవడంపై ఎక్కువగా ఆలోచించలేదు. అంతిమంగా ఇది పీసీబీ నిర్ణయమే’’
టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ నిష్క్రమణకు బాధ్యత వహిస్తారా అన్న ప్రశ్నకు ఇది టీం ఉమ్మడి బాధ్యత అని అన్నాడు. ‘‘ఏ ఒక్కరి వల్లనో మేము ఓడిపోలేదు. ఓ టీంగానే మేము విజయాలు, ఓటములు ఎదుర్కొంటాము. నేను కెప్టెన్ కదా అని మీరు అంటున్నారు. కానీ ప్రతి క్రీడాకారుడి ఆట నేను ఆడలేను. టీంలో 11 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఓ బాధ్యత ఉంది. అందుకే వారు వరల్డ్ కప్‌లో పాలుపంచుకునేందుకు వచ్చారు. కానీ, మేము ఓ జట్టులాగా కలిసికట్టుగా ఆడలేకపోయాము. ఈ విషయాన్ని అంగీకరించకతప్పదు’’
‘‘అంచనాలకు అనుగుణంగా మేము ఆడలేకపోయాం. మంచి టీం, అనుభవం ఉన్నా మేము ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాము. అయితే, ఒక కెప్టెన్ గా నేను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించలేను. మా అందరిదీ తప్పే’’ అని బాబర్ అన్నాడు.