BAN vs NEP: నేపాల్‌పై విజయం.. సూపర్-8కి బంగ్లాదేశ్.. 22న భారత్‌తో ఢీ
- కింగ్స్టౌన్ వేదికగా నేపాల్, బంగ్లాదేశ్ మ్యాచ్
- 21 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం
- బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్
- 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలిన నేపాల్
- గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికాతో పాటు బంగ్లా సూపర్-8కి అర్హత
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సూపర్-8కి దూసుకెళ్లింది. గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా తర్వాత తదుపరి దశకు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. దీంతో సూపర్-8లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఈ నెల 22న టీమిండియాతో బంగ్లా తలపడనుంది.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను నేపాల్ బౌలర్లు 106 పరుగులకే కట్టడి చేశారు. ఆ జట్టు బ్యాటర్లలో షకీబ్ చేసిన 17 రన్సే అత్యధిక వ్యక్తిగత స్కోరు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర, రోహిత్, సందీప్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఆ తర్వాత 107 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచింది. నేపాల్ బ్యాటర్లలో కుశాల్ మల్ల (27), దీపేంద్ర సింగ్ అరీ (25), అసీఫ్ షేక్ (17) పరుగులు చేశారు. 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో కుశాల్ మల్ల, దీపేంద్ర సింగ్ 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు.
కానీ, ఈ జోడీ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ బాట పట్టడంతో చివరికి నేపాల్ 85 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ 4, ముస్తాఫిజుర్ 3, షకీబుల్ 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. 4 వికెట్లు పడగొట్టి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన తంజిమ్ హసన్ షకీబ్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.