Revanth Reddy: ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
- కానిస్టేబుల్ సురేశ్‌ను అభినందించిన రేవంత్ రెడ్డి
- యూపీఎస్‌సీ రాయాల్సిన ఓ యువతిని సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చిన సురేశ్
- యువతికి పరీక్షకు ఆలస్యం కావడంతో సురేశ్ పోలీస్ బైకుపై ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టిన వైనం
రాజేంద్రనగర్‌లో నిన్న యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ రాయాల్సిన ఓ యువతని సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. "వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌కు నా అభినందనలు. సురేశ్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్‌సీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్" అంటూ సీఎం రేవంత్ పోస్ట్ చేశారు.
కాగా, ఆదివారం యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ యువతికి ఆలస్యం కావడంతో కానిస్టేబుల్ సురేశ్ ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టారు. మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంకు వెళ్లాల్సిన ఓ యువతి.. ఆర్‌టీసీ బస్సుల్లో మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగారు. అక్కడి నుంచి పరీక్ష కేంద్రం చాలా దూరం. పైగా సమయం మించిపోతుండడంతో ఆమె కంగారు పడుతున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సురేశ్ అది గమనించి, ఆమె వద్దకు వెళ్లి విషయం అడిగి తెలుకున్నారు. అనంతరం ఆమెను పోలీస్ బైకుపై పరీక్ష కేంద్ర వద్దకు తీసుకెళ్లి దిగబెట్టారు.