Loan Waiver: తెలంగాణలో రైతు రుణమాఫీకి కొత్త రూల్..?
- పాస్ బుక్, రేషన్ కార్డు ఉన్న రైతులకే వర్తింపు
- ప్రతిపాదించిన అధికారులు.. పరిశీలిస్తున్న ప్రభుత్వం
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రుణ మాఫీ చేయొద్దని ప్రతిపాదన
తెలంగాణ రైతుల రుణమాఫీ విషయంలో విధివిధానాల ఖరారుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఎవరికి వర్తింపజేయాలి, ఎవరెవరిని ఈ స్కీం నుంచి మినహాయించాలనే విషయంలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకొస్తున్నాయి. వాటిని పరిశీలిస్తూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి చూపాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే అధికారులు ఓ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. రాష్ట్రంలో ల్యాండ్ పాస్ బుక్, రేషన్ కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు, ఉద్యోగులను ఈ పథకం నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశంలో ప్రతిపాదించారు. మరోవైపు, రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం తెప్పిస్తోంది.
భారం తగ్గే మార్గాలు..
తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి 66 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. దాదాపుగా వీరంతా రూ.2 లక్షల లోపు రుణం పొందారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రైతుబంధు లబ్దిదారులలో సుమారు 6 లక్షల మందికి ల్యాండ్ పాస్ బుక్ లు లేవని, దీనిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల 6 లక్షల మంది, రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటే మరో 18 లక్షల మంది లబ్దిదారులు తగ్గుతారని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ స్కీం నుంచి తప్పిస్తే రుణమాఫీ భారం మరింత తగ్గుతుందని చెప్పారు. ఈ మినహాయింపుల తర్వాత సుమారు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేలతారని వివరించారు.
వర్తింపు ఎప్పటి నుంచి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి గతేడాది ముందు వరకు మినహాయించి అంతకుముందు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తింపజేయాలని అధికారులు మరో ప్రతిపాదన చేశారు. అయితే, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీకి కటాఫ్ తేదీగా 2018 డిసెంబరు 12 ను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తేదీ తర్వాత తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీ అర్హులను తేల్చే విషయంలో, విధివిధానాల రూపకల్పనలో మంత్రిమండలిలో సమగ్ర చర్చ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.