Tirumala: ధర్మారెడ్డి రిటైర్ అయినా, కరుణాకరెడ్డి రిజైన్ చేసినా తప్పించుకోలేరు: టీడీపీ నేత విజయ్ కుమార్

Neelayapalem Vijay Kumar slams Dharmareddy and Karunakar Reddy

  • తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైందని వెల్లడి
  • ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి శుద్ధపూసలేమీ కాదని వ్యాఖ్యలు
  • కమీషన్ల పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారని ఆరోపణలు
  • దొరికిపోతామని భావించి వెబ్ సైట్ నుంచి వివరాలు మాయం చేశారని విమర్శ  

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. ధర్మారెడ్డి రిటైర్ మెంట్ ఇచ్చినంత మాత్రాన, కరుణాకర రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరూ శుద్ధపూసలు అయిపోతారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

శ్రీవాణి ట్రస్ట్  పేరుతో, సమరత సేవా ట్రస్ట్ కు నిధుల పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఈ ఐదేండ్లలో తిరుమలలో హిందూ వ్యతరేక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు ఎన్నో జరిగాయని విజయ్ కుమార్ మండిపడ్డారు. ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డిల నేతృత్వంలో తిరుమలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. 

ఇప్పుడు ప్రభుత్వం మారాక చైర్మన్ పదవికి కరుణాకరెడ్డి రిజైన్ చేసినా, ధర్మారెడ్డి రిటైర్డ్ అయినా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. కమీషన్ లు దండుకోవడానికి మూడు నెలల్లోనే రూ.1233 కోట్ల పనులు కట్టబెట్టారని, దాదాపు రూ.100 కోట్లకు పైగా కొట్టేశారని తెలిపారు. 

ఎక్కడ దొరికిపోతామోనని బోర్డు తీర్మానాలు, ఇంజనీరింగ్ పనులన్నీ వెబ్ సైట్ నుండి మాయం చేశారని ఆరోపించారు. చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని నీలాయపాలెం విజయ్ కుమార్ హెచ్చరించారు. 

"ధర్మారెడ్డి ఈవోగా ఛార్జ్ తీసుకున్నాక 2021-22 నుండి ఇంజనీరింగ్ పనుల వివరాలను దేవస్థానం వెబ్ సైట్ లో పెట్టలేదంటే ఏమనుకోవాలి. ఉన్న సత్రాలను నేలమట్టం చేయాల్సిన అవసరం ఏముంది? స్విమ్స్ లో అడిషనల్ బ్లాక్ లు, సత్రాల పేరుతో ఇలా ఏడెనిమిది వర్క్ లు కట్టబెట్టి అడ్వాన్స్ లు ఇచ్చాక వాళ్ల దగ్గర నుండి కరుణాకర్ రెడ్డి 18 % చొప్పున రూ.100 కోట్లకు పైగా కమీషన్ లు దండుకున్నారు. ఈవోకు ధర్మారెడ్డికి తెలిసే కరుణాకర్ రెడ్డి కుమారుడి కోసం ఇదంతా చేశారు. 

కట్టబెట్టిన వర్క్ లు బోర్డు ఆమోదించిందో లేదో... కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు మాత్రమే తెలుసు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందికి వస్తుంది... ధర్మారెడ్డి మాత్రం దేవస్థానం ఆర్టీఐ కిందకు రాదని చెబుతాడు... అందుకే ఏ సమాచారం ఇవ్వడట. కరుణాకర్ రెడ్డి వచ్చాక బోర్డు తీర్మానాలు పెట్టడం మానేశారు. ఇంజనీరింగ్ వర్క్ 2021 -22 వివరాలు మాత్రమే ఉన్నాయి. 2022-23, 2023-24 వివరాలు లేవు. 

దొంగ ఇంట్లోకి వచ్చేప్పుడు సీసీ కెమెరాలు ఆపి వచ్చినట్లు... బోర్డులో వర్క్ వివరాలు ఉంటే తమ గుట్టు బయటకు పడుతుందని కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు బోర్డు తీర్మానాలు వెబ్ సైట్ లో లేకుండా చేశారు. వీటిని సమీక్షించాల్సిన ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లప్పగించి చూస్తూ సహకరించారు . తప్పులకు సహకరించిన ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ఎక్కడికి జంప్ అయినా తప్పించుకోలేరు. 

శ్రీవాణి ట్రస్ట్ గురించి గత సంవత్సరం జూన్ లో టీటీడీ ఒక శ్వేత పత్రం విడుదల చేసింది. ఆ పత్రం ప్రకారం... శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చిన నిధుల ద్వారా మొత్తం 2,273 దేవాలయాలను కడతామని.. అందులో 1,953 దేవాలయాలు దేవాదాయ శాఖ ద్వారా, 320 గుడులు సమరత సేవ ట్రస్ట్ ద్వారా నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి గుడికి రూ.10 లక్షల వంతున కేటాయించినట్లు శ్వేతపత్రంలో తెలియజేశారు. అంటే దాదాపు రూ.32 కోట్లు సమరత సేవా ట్రస్ట్ కు ఇచ్చారు. 

కానీ సమరత సేవా ట్రస్ట్ వెబ్ సైట్ కు వెళ్లి చూస్తే.. ప్రతి గుడికి రూ.5 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు, అది కూడా 2015-18 మధ్యలో టీటీడీ ఇచ్చిన రూ.25 కోట్ల గ్రాంటు కింద అని వెబ్ సైట్ లో ఉంది.  

ఇక పారిశుద్ధ్యం పేరుతో దోపిడీకి యత్నం, మాజీ మంత్రి రోజాకి ప్రతి వారం 50 నుంచి 60 దర్శనం లెటర్ల దగ్గర నుంచి, వైజాగ్ స్వరూపానంద ఆశ్రమానికి నూరు శాతం అతిక్రమణలతో భవన అనుమతులు వరకు ధర్మా రెడ్డి మీద పెద్ద సంఖ్యలో అభియోగాలు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా టీటీడీలో దేవుడికి రెండో స్థానమే ఇచ్చి రాజకీయాలకు అవినీతికి మొదటి స్థానం ఇచ్చారు ధర్మారెడ్డి. 

ఇప్పుడు కొత్త ఈవో శ్యామలరావుగారి నియామకం జరిగింది. ప్రభుత్వానికి మా వినతి ఏంటంటే... ఈ ఐదేళ్లలో ధర్మారెడ్డి గారి లీలలన్నీ శాఖాపరమైన ఎంక్వైరీతో తేలే విషయాలు కావు. ఎందుకంటే ప్రతి అవినీతికి మూలాలు చాలా పొడవుగా ఉన్నాయి. అందుకని ధర్మారెడ్డిని రిలీవ్ చెయ్యకుండా, ఆయన హయాంలో జరిగిన అన్నీ విషయాల మీద ఒక న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము" అంటూ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News