Lockie Ferguson: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. కివీస్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ సరికొత్త రికార్డ్!
- తరుబా వేదికగా పాపువా న్యూ గినియా, న్యూజిలాండ్ మ్యాచ్
- 4కి 4 ఓవర్లు మెయిడిన్ వేసి 3 వికెట్లు తీసిన లూకీ ఫెర్గూసన్
- టీ20 ప్రపంచకప్ చరిత్రలో 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా ఘనత
- టీ20ల్లో ఫెర్గూసన్ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకున్న కెనడాకు చెందిన సాద్ బిన్ జఫర్
- పీఎన్జీపై కివీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. 4కి 4 ఓవర్లు మెయిడిన్ వేశాడు. అంతేగాక 3 వికెట్లు కూడా పడగొట్టాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు ఇవే. అలాగే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా కూడా ఫెర్గూసన్ నిలిచాడు. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచులో కివీస్ ఈ నయా రికార్డు అందుకున్నాడు. గతంలో కెనడాకు చెందిన సాద్ బిన్ జఫర్ కూడా 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
కివీస్‌కు ఓదార్పు విజయం
ఇక పాపువా న్యూ గినియాతో జరిగిన ఈ మ్యాచులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పీఎన్జీని ఫెర్గూసన్ ఘోరంగా దెబ్బతీశాడు. దీంతో ఆ జట్టు 78 పరుగులకే కుప్పకూలింది.
ఛేదనలో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే ఈ రెండు జట్లు టీ20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇటీవల కాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతున్న కివీస్.. ఐసీసీ ఈవెంట్లో ఇలా నాకౌట్‌కు చేరకుండా వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.