Amaravati: అమరావతిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు: మంత్రి నారాయణ
- కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని వెల్లడి
- అభివృద్ధి పనులకు సంబంధించి కొత్తగా టెండర్లను పిలవాల్సి ఉందన్న మంత్రి
- కొత్త అంచనాలతో టెండర్లను పిలుస్తామన్న నారాయణ
రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేపు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తారని తెలిపారు. కమిటీలు వేసి రాజధాని ప్రాంతంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామన్నారు. అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల కాలపరిమితి ముగిసిందని... కాబట్టి కొత్త టెండర్లను పిలవాల్సి ఉందన్నారు. కొత్త అంచనాలతో టెండర్లను పిలవాల్సి ఉంటుందన్నారు.
ఈ టెండర్ల ప్రక్రియకు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని మంత్రి తెలిపారు. కేబినెట్లో చర్చించిన అనంతరం ఈ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమరావతిలో అభివృద్ధి పనులకు రెండున్నర సంవత్సరాల సమయం పట్టవచ్చునన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడుతూ, ఇది సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయమై న్యాయ సలహాలు తీసుకుంటామన్నారు.