Air Pollution: వాయు కాలుష్యం కారణంగా.. రోజూ 2 వేల పైచిలుకు చిన్నారుల బలి!
- ఐదేళ్ల లోపు సుమారు 7 లక్షల మంది చిన్నారులు వాయు కాలుష్యానికి బలి
- అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం
- 90 శాతానికి పైగా మరణాలకు ప్రధాన కారణం పీఎమ్ 2.5 సూక్ష్మ ధూళికణాలు
- హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి
వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 2021లో వాయుకాలుష్యం దెబ్బకు 81 లక్షల మంది బలైనట్టు కూడా ఈ అధ్యయనం తేల్చింది. అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది.
వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధికంగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. యూనీసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ వార్షిక నివేదికను వెలువరించింది. ఐదేళ్ల లోపు సుమారు 7 లక్షల మంది చిన్నారులు వాయు కాలుష్యానికి బలైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటమేనని తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం. ప్రపంచంలోని దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తేల్చింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యం 2021లో 5 లక్షల పైచిలుకు మందిని బలితీసుకుంది. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి దాదాపు ఒకేవిధమైన పరిష్కార మార్గాలు ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తేల్చారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే, మరింత మెరుగైన స్టవ్లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గిపోయాయి. దాదాపు 200 దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. అయితే, ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచ దేశాలు 2.2 బిలియన్ డాలర్లు కేటాయించినట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మేనెలలోనే పేర్కొంది.