Italy: ఇటలీలో అమానవీయ ఘటన.. పొలంలో చేయి తెగిన భారతీయ కార్మికుడిని రోడ్డుపైనే వదిలేసిన వైనం..!
- లాటినా ప్రాంతంలో సత్నాం సింగ్ పొలం పనిచేస్తుండగా తీవ్ర ప్రమాదం
- యంత్రం తగిలి చేయి తెగి పడటంతో ప్రాణాపాయంలో పడ్డ వైనం
- బాధితుడిని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం
ఇటలీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. లాటినా ప్రాంతంలోని ఓ పొలంలో పనిచేస్తుండగా చేయి తెగి అపాయంలో పడ్డ భారతీయుడిని కొందరు నిర్దాక్షిణ్యంగా అతడి ఇంటి వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోవడంతో బాధితుడు దుర్మరణం చెందాడు. ఇటలీ కార్మిక శాఖ మంత్రి పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని అత్యంత అమానవీయ చర్యగా మంత్రి వ్యాఖ్యానించారు.
రోమ్కు దక్షిణాన ఉన్న లాటినా అనే ప్రాంతంలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. సత్నామ్ సింగ్ అనే వ్యక్తి అక్కడి పోలాల్లో పనిచేసేవాడు. సోమవారం అతడు తన పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తూ ఓ యంత్రం తగిలి అతడి చేయి తెగి పడిపోయింది. రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నాం సింగ్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఇంటివద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అతడిని గుర్తించిన భార్య, స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించడంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం కన్నుమూశాడు.
కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకునే సంస్థలకు పేరు పడ్డ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా పెను కలకలానికి దారి తీసింది. బాధితుడితో వ్యవహరించిన తీరును సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఘటనను నాగరికతకు ఓటమిగా అభివర్ణించింది. గ్యాంగ్ మాస్టర్ల ఆటకట్టించి, కార్మికులకు గౌరవప్రదమైన జీవనం, పని వసతులు కల్పించేందుకు తాము పోరాడుతూనే ఉంటామని ఎక్స్ వేదికగా పేర్కొంది.