Nimmala Rama Naidu: జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామానాయుడు

Nimmala Rama Naidu Swears As Minister

  • సచివాలయంలో నాలుగో బ్లాక్‌లో బాధ్యతల స్వీకరణ
  • చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు ధన్యవాదాలు
  • పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపణ
  • గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత ఫైలుపై తొలి సంతకం పెట్టిన రామానాయుడు

ఏపీ జలవనరులశాఖ మంత్రిగా టీడీపీ నేత నిమ్మల రామానాయుడు కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు కీలకమైన జలవనరులశాఖ అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులను వేగంగా చేశామని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనులపై సమీక్షించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. తప్పు చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తాము పోలవరం కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. వ్యవసాయం, రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని విమర్శించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీతపై తొలి సంతకం చేసినట్టు వివరించారు.

ప్రస్తుత వర్షాకాలంలో కాలువ, ఏటి గట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. పోలవరం పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ వైసీపీ నేతల బుద్ధి మారడం లేదని రామానాయుడు విమర్శించారు.

రామానాయుడు బాధ్యతల స్వీకరణకు ముందు కొందరు దివ్యాంగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన దివ్యాంగులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన స్వయంగా మిఠాయిలు తినిపించారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేల పింఛన్‌ను వచ్చే నెల నుంచి రూ. 6 వేలకు పెంచి ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News