IIT Bombay: విద్యార్థుల‌కు రూ. 1.20 లక్ష‌ల చొప్పున జ‌రిమానా వేసిన‌ బాంబే ఐఐటీ.. కార‌ణం ఏంటంటే..!

Rs 1Lakh 20 Thousand Fine Each On IIT Bombay Students Over Ramayana Play
  • రామాయణంకు పేరడీగా 'రాహోవన్' నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు  
  • అందులో రాముడు, సీత పాత్ర‌ల‌ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన‌ట్లు ఓ వర్గం విద్యార్థుల ఫిర్యాదు
  • దీంతో ఎనిమిది మంది విద్యార్థుల‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఐఐటీ అధికారులు
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులు ఇటీవల ప్రదర్శించిన 'రాహోవన్' నాటకం ద్వారా రామాయణాన్ని కించపరిచారన్న కారణంగా వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది విద్యార్థులకు జ‌రిమానా విధించారు. వీరిలో న‌లుగురికి రూ. 1.20 లక్షల చొప్పున‌ జరిమానా విధించ‌గా, జూనియ‌ర్లు అయిన మ‌రో న‌లుగురికి రూ. 40వేల చొప్పున ఫైన్ విధిస్తూ, ఆ జూనియ‌ర్ విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యాన్ని తొలగించారు. 

వివ‌రాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ఐఐటీ బాంబేలో మార్చి 31న కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఆ సందర్భంగా రామాయణంకు పేరడీగా రచించిన 'రాహోవన్' అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో స్త్రీవాద సమస్యల పేరుతో రాముడి పాత్రను తారుమారు చేసి పాత్రల పేర్లలో మార్పులు చేశారు. వేదికపై దేవుడిని ఎగతాళి చేస్తూ డైలాగ్స్ చెప్పారు. దీంతో ఈ నాటకాన్ని ఓ వర్గం విద్యార్థులు వ్యతిరేకించారు. ఇది హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉందని ఆరోపించారు. రాముడు, సీత పాత్ర‌ల‌ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన‌ట్లు పేర్కొన్నారు.

దీంతో ఈ డ్రామాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మే 8న ఐఐటీ క్రమశిక్షణా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత శిక్షను నిర్ణయించారు. అనంతరం ఈ నాటకంలో పాల్గొన్న విద్యార్థులు జరిమానా చెల్లించాలంటూ ఈ నెల 4న నోటీసు ఇచ్చారు. జరిమానాను జులై 20, 2024న డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని నోటీసులో పేర్కొన‌డం జ‌రిగింది.  

అంతేకాదు శిక్షను ఉల్లంఘిస్తే మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని కూడా ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొంద‌రు ఓ విద్యార్థికి ఒక సెమిస్టర్‌ ఫీజుతో సమానమైన జరిమానా విధించడం పట్ల విమర్శ‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అలా దేవుడి పాత్రలను కించపరచడం సరికాదని అంటున్నారు.
IIT Bombay
Ramayana Play
Fine
Students

More Telugu News