New Delhi: అగ్నిగుండంగా మారిన ఉత్తరాది... ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మృతి!
- మార్చి 1 నుంచి దేశంలో 40 వేల వడదెబ్బ కేసుల నమోదు
- దేశంలో 110 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాల వెల్లడి
- జూన్ నెలలో ఓ వారంలోనే 192 మంది మృతి చెందినట్లు స్వచ్చంధ సంస్థ వెల్లడి
అధిక ఉష్ణోగ్రతలతో ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండాలుగా మారాయి. మార్చి 1 నుంచి జూన్ 18 మధ్యకాలంలో దేశంలో దాదాపు 40 వేల వడదెబ్బ కేసులు, 110 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే జూన్ నెలలో ఒక్క వారంలోనే ఢిల్లీలో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ స్వచ్చంధ సంస్థ వెల్లడించింది.
వడదెబ్బతో ఉత్తర ప్రదేశ్లో 36 మరణాలు చోటు చేసుకున్నాయని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ ఉష్ణోగ్రత ప్రభావిత అనారోగ్యం, మరణాల పర్యవేక్షణ విభాగం తెలిపింది. బీహార్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలలో పదుల సంఖ్యలో మృత్యువాత పడినట్లు వెల్లడించింది.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 11 నుంచి 19 మధ్య వడదెబ్బతో 192 మంది నిరాశ్రయులు మృతి చెందారని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే స్వచ్చంధ సంస్థ వెల్లడించింది. గత రెండు రోజుల్లో లభ్యమైన మృతదేహాల్లో ఎక్కువగా నిరాశ్రయులవేనని వెల్లడించింది. దీనిని అధికారులు ధ్రువీకరించవలసి ఉంది. మరోవైపు, గత 48 గంటల్లో 50 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరంతా వడదెబ్బకు చనిపోయారా? ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉందన్నారు.
వడదెబ్బ కారణంగా ఢిల్లీ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో 33 మంది చేరగా... ఇందులో 13 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే సఫ్దర్ గంజ్, ఆర్ఎంఎల్, ఎల్ఎన్జీపీ ఆసుపత్రుల్లో 20 మరణాలు నమోదయ్యాయి.