Pakistan: వరల్డ్ కప్ లో ఘోరంగా ఆడిన పాక్ క్రికెటర్లపై మాజీ ఆటగాడు ఫైర్
- అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్
- లీగ్ దశలోనే ఇంటి దారి పట్టిన పాక్ జట్టు
- పాక్ ఆటగాళ్లపై విమర్శల జడివాన
- పెళ్లాంబిడ్డలను వెంటేసుకుని విహారయాత్రకు వెళ్లారా? అంటూ అతిక్ విమర్శలు
అనిశ్చితికి మారుపేరుగా నిలిచే పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ తన ట్రేడ్ మార్కుకు న్యాయం చేసింది. గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అన్నింటికి మించి పసికూన అమెరికా చేతిలో కూడా ఓడిపోయి తన అవకాశాలను తానే దెబ్బతీసుకుంది.
తమ జట్టు మాత్రం గ్రూప్ స్టేజ్ లోనే చతికిలపడగా, ఇదే గ్రూప్ లో ఉన్న భారత్ దర్జాగా సూపర్-8లో అడుగుపెట్టడం పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు పుండుమీద కారం చల్లినట్టయింది. దాంతో వారు తమ క్రికెటర్లపై కారాలుమిరియాలు నూరుతున్నారు. మాజీ ఆటగాడు అతిక్ ఉజ్జమాన్ కూడా పాక్ క్రికెట్ జట్టుపై మండిపడ్డాడు.
మీరు వరల్డ్ కప్ ఆడడానికి వెళ్లారా, లేక పెళ్లాంబిడ్డలను వెంటేసుకుని విహారయాత్రకు వెళ్లారా? అని ధ్వజమెత్తాడు. క్రికెట్ ఆడుతున్నట్టు నటించి, ఫ్యాన్స్ ను భలే మోసం చేశారని ఎద్దేవా చేశాడు.
"17 మంది ఆటగాళ్లకు 60 హోటల్ రూమ్ లు అవసరమా? మేం ఆడే సమయంలో జట్టుతో పాటు ఒక కోచ్, ఒక మేనేజర్ ఉండేవారు. కానీ ఇప్పుడు 17 మంది ఆటగాళ్లు ఉంటే, అధికారులు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. ఒక ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ కు కుటుంబాలను కూడా తీసుకెళ్లినప్పుడు, నిజంగానే ఆటపై దృష్టి నిలపగలరా?
కుటుంబాలతో వెళ్లినప్పుడు ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆటగాళ్లంతా కలిసిమెలిసి గడపాల్సిన సమయంలో... ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించారు... కనీసం వీళ్లకు క్రమశిక్షణ కూడా లేదు... కొన్ని రోజుల పాటు వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టలేరా? మీపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు దేశం కోసం ఈ మాత్రం చేయలేరా?" అంటూ అతిక్ ఉజ్జమాన్ నిప్పులు చెరిగాడు.
పాకిస్థాన్ క్రికెట్ లో ఇలాంటి సంస్కృతి వస్తుందని ఊహించలేదని, ఇది ఎంతో బాధాకరమని ఉజ్జమాన్ పేర్కొన్నాడు.