Hyderabad: ఆర్థిక క్రమశిక్షణలో హైదరాబాదీలే టాప్.. పొదుపులో నెం.1
- రూ.3.5 లక్షల పైచిలుకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ సర్వే
- దేశంలో మధ్యతరగతికి అత్యంత అనుకూలమైన రెండో నగరంగా హైదరాబాద్
- హైదరాబాదీల సగటు నెలవారీ ఆదాయం రూ. 44 వేలుగా తేలిన వైనం
- పొదుపులో నెం.1గా నిలిచిన భాగ్యనగరవాసులు
ఆర్థిక క్రమశిక్షణలో తమకు మించిన వారు లేరని హైదరాబాదీలు నిరూపించారు. యావత్ దేశంలో పొదుపులో నగరవాసులు నెం.1గా ఉన్నారని ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. సగటు వ్యక్తిగత ఆదాయంలో హైదరాబాదీలు 17 నగరాల కంటే ముందున్నారని పేర్కొంది. మధ్యతరగతి వర్గాలు సౌకర్యంగా జీవించడానికి, ఆదాయం పొందేందుకు భాగ్యనగరం సరైన ప్రదేశమని కితాబునిచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మధ్యతరగతి జీవనంపై జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
పొదుపులో టాప్
మధ్యతరగతి కుటుంబాల్లో ఆదాయం, ఖర్చులపై పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 18 నుంచి 55 ఏళ్ల వయసుండి.. వార్షిక ఆదాయం 3.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారిని ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు
ఈ అధ్యయనం ప్రకారం, మధ్యతరగతి ప్రజలకు అనుకూల నగరంగా హైదరాబాద్ వరుసగా రెండోసారి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యధిక నెలవారీ ఆదాయం ఉన్న నగరాల్లో రూ. 44 వేలతో మొదటిస్థానంలో ఉంది. సగటు వ్యక్తిగత నెలవారీ ఆదాయం 2023లో రూ. 44 వేల నుంచి రూ.44 వేలకు పెరిగింది. స్థిర నెలవారీ ఖర్చులు రూ.19 వేల నుంచి రూ. 24 వేలకు పెరిగాయి.
నగరంలోని 69 శాతం మంది ఖర్చు తగ్గించి పొదుపువైపు మొగ్గు చూపారని అధ్యయనం తేల్చింది. నెలవారీ ఖర్చుల విషయానికి వస్తే పర్యటనలు లేదా విహారయాత్రలకు 35 శాతం, బయటి ఆహారానికి 19 శాతం, ఫిట్‌నెస్‌కు 6 శాతం, ఓటీటీ యాప్‌లకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు. గత ఆరు నెలల్లో 57 శాతం మంది దుస్తులు, ఇతర అవసరమైన వస్తువులనే కొనుగోలు చేశారని ఈ సర్వే తేల్చింది. 88 శాతం మంది తమ సేవింగ్స్‌ను నగదు రూపంలోనే భద్రపరుస్తున్నారు. 26 శాతం మంది నగరవాసులు వారి ఆర్థిక సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేస్తుండగా 25 శాతం మంది ఈ వివరాలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు.