Virat Kohli: కేవలం 61 మ్యాచ్‌ల్లోనే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య

Surya Kumar Yadav matched highest player of the matches World Record that was held by Virat Kohli
  • అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న వ్యక్తిగా నిలిచిన సూర్య
  • విరాట్ కోహ్లీతో సమంగా నిలిచిన ‘మిస్టర్ 360’
  • కోహ్లీ 113 మ్యాచ్‌ల్లో.. సూర్య కేవలం 61 మ్యాచ్‌ల్లోనే 15 సార్లు అవార్డు అందుకున్న ఘనత
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సూపర్-8 దశలో గురువారం ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్, ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లీ విఫలమవడంతో టీమిండియా కష్టాల్లో పడ్డ వేళ సూర్య అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లోనే 53 పరుగులు బాదాడు. దీంతో ప్రత్యర్థికి భారత్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ తర్వాత బౌలర్లు సైతం చెలరేగడంతో భారత్ తిరుగులేని విజయం విజయం సాధించింది. ఈ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్‌కు ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య 15వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’కు ఎంపికయ్యాడు. 

15వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డ్‌ను సూర్య సమానం చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాళ్లలో కోహ్లీతో సంయుక్తంగా సూర్య అగ్రస్థానంలో నిలిచాడు. వీరిరువురూ చెరో 15 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్నారు.

విరాట్ కోహ్లీ మొత్తం 113 మ్యాచ్‌లు ఆడి 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోగా.. సూర్య కేవలం 61 మ్యాచ్‌లోనే 15 సార్లు అందుకోవడం విశేషం. కాగా సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ 1 ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
Virat Kohli
Surya Kumar Yadav
T20 World Cup 2024
India vs Afghanistan
Cricket

More Telugu News