Thieves: కొరియర్ ఇలా డెలివరీ చేశాడో లేదో.. అలా వచ్చి పోటీపడి మరీ ఎత్తుకెళ్లారు.. వీడియో ఇదిగో!
- అమెరికాలో ఒకే పార్సిల్ కోసం ఇద్దరు దొంగల కొట్లాట
- డెలివరీ వ్యాన్ వెనకే వచ్చి విలువైన ఫోన్ల పార్సిల్ ఎత్తుకెళ్లిన దొంగలు
- తన ఆర్డర్ వివరాలు దొంగలకు ఎలా తెలిశాయని ఇంటి యజమాని సందేహం
అమెరికాలో ఓ పార్సిల్ దొంగిలించేందుకు ఇద్దరు దొంగలు కొట్లాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెలివరీ వ్యాన్ వెనకే తమ కార్లలో ఫాలో అవుతూ వచ్చిన దొంగలు.. డెలివరీ బాయ్ పార్సిల్ ను ఇంటి ముందు పెట్టి వెళ్లిన మరుక్షణంలోనే దానిని కాజేశారు. అప్పటి వరకు కారులో కూర్చున్న దొంగలు రాకెట్ స్పీడ్ తో దూసుకొచ్చారు.
దొంగిలించేందుకు పోటీపడి కత్తితో ఒకరు, పూలకుండీతో మరొకరు బెదిరించుకున్నారు. చివరికి ఇద్దరిలో ఒకరు ఆ పార్సిల్ ను సొంతం చేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా డోర్ బెల్ కు అమర్చిన కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇంటి ఓనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ యజమాని వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆన్ లైన్ లో విలువైన ఫోన్లను ఆర్డర్ చేయగా.. ఆ కంపెనీ ఫెడ్ ఎక్స్ కొరియర్ కంపెనీ ద్వారా డెలివరీ చేసిందన్నారు. ఫెడ్ ఎక్స్ వ్యాన్ వచ్చి ఇంటిముందు ఆగడం, అందులో నుంచి కంపెనీ ఉద్యోగి తన పార్సిల్ ను తీసుకొచ్చి ఇంటిముందు ఉంచడం కనిపించింది. ఆ తర్వాత ఇద్దరు దొంగలు దానిని కాజేయడానికి కొట్లాడుకోవడం చూసి తనకు భయమేసిందని చెప్పాడు.
ఒకవేళ ఆ పార్సిల్ కోసం తన కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వస్తే ఏం జరిగి ఉండేదోనని టెన్షన్ పడ్డట్లు తెలిపాడు. ఫోన్లు పోతే పోయాయ్ కానీ, ఇలా దొంగలు ఒకరిపై ఒకరు దాడికి తెగబడే ప్రయత్నం చేయడం మాత్రం ఆందోళన కలిగించిందని అన్నాడు. అసలు తాను విలువైన ఫోన్లు ఆర్డర్ చేసినట్లు ఆ దొంగలకు ఎలా తెలిసిందని, ఇందులో ఏదో తిరకాసు ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.