Nara Lokesh: అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు: నారా లోకేశ్
- ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న అంటూ ప్రశంస
- ఒకే పార్టీ.. ప్రజలే అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న అని కితాబు
- అయ్యన్నపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడలేదంటూ వ్యాఖ్య
ఏపీ 16వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రశంసిస్తూ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో మాట్లాడారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేశ్ అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని తెలిపారు. వైసీపీ హయాంలో కక్షగట్టి అయ్యన్న ఇంటిని కూలగొట్టినా, కేసులు పెట్టినా తగ్గకుండా పోరాడారని కొనియాడారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉందన్నారు.
25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారని, 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు. ఇక గతంలో సభ ఎంతో హుందాగా జరిగేదని, గత ఐదేళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవరించిందంటూ దుయ్యబట్టారు. సభ సంప్రదాయాలను గౌరవించేలా.. సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని లోకేశ్ స్పీకర్ను కోరారు.
అయ్యన్న నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడి నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. తనకు ఎప్పుడు సలహా కావాలన్నా ఆయనను సంప్రదించానని లోకేశ్ తెలిపారు. ఒకే పార్టీ, ప్రజలే అజెండాగా అయ్యన్న ముందుకెళ్లారన్నారు. ఆయన ఆధ్వర్యంలో సభను గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. స్వపక్షమే ప్రతిపక్షంలా మారి ప్రజల సమస్యలపై సభలో చర్చిస్తామన్నారు.