Dhulipala Narendra Kumar: అధికారం పోయాక జగన్ సభా సంప్రదాయాలు కూడా పాటించడంలేదు: ధూళిపాళ్ల నరేంద్ర
- ఇవాళ ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
- స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరు
- ఇది బీసీలను అవమానించడమేనన్న ధూళిపాళ్ల నరేంద్ర
- జగన్ కు పనుండి రాలేకపోతే మిగతా వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైందని ఆగ్రహం
అసెంబ్లీ సమావేశాల తొలి రోజున హాజరై, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మాజీ సీఎం జగన్... రెండో రోజు సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు జగన్ గైర్హాజరయ్యారు. దీనిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు.
అధికారం పోయాక జగన్ సభా సంప్రదాయాలు కూడా పాటించడంలేదని విమర్శించారు. స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరవడం అంటే బీసీలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. జగన్ కు పనుండి రాలేకపోయాడనుకుంటే, మిగతా వైసీపీ ఎమ్మెల్యే గైర్హాజరును ఎలా చూడాలని ధూళిపాళ్ల ప్రశ్నించారు.
"ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అహంకారం దిగలేదు అనుకోవాలా? అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే విపక్షం హాజరుకాకపోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. మేం ప్రతిపక్షంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు లేని హోదా కోరుకుంటూ సభను ఎగ్గొట్టే సాకులు వైసీపీ వెతుక్కుంటోంది. జగన్ కు ప్రజా తీర్పు గౌరవించే ధైర్యం కూడా లేదనుకోవాలా? జగన్ అధికారంలో ఉండగా వ్యవస్థలను నాశనం చేశారు. ఇప్పుడు అధికారం పోయాక కూడా, సభకు సహకరించం అన్నట్టుగా జగన్ తీరు ఉంటే మేమేం చేయాలి? వాస్తవాలు గ్రహించం అన్నట్టు వైసీపీ వ్యవహరిస్తుంటే వారికే నష్టం" అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.