Nara Lokesh: మంగళగిరి ప్రజల కోసం లోకేశ్ తీసుకువచ్చిన ప్రజాదర్బార్ కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతుల వెల్లువ
- మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన నారా లోకేశ్
- మంగళగిరి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు
- తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద బారులు
మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచీ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు.
తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోనే చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేశ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
రోజురోజుకు ప్రజలనుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారినుంచి వినతులు స్వీకరిస్తూ లోకేశ్ భరోసా ఇస్తున్నారు. తన దృష్టికి వస్తున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ఆదేశాలిస్తున్నారు.
శనివారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్ లోనూ వినతులు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలు తమ భూములను కబ్జా చేశారని, ఉండవల్లి-రేవేంద్రపాడు రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని, జగన్ నివాసం ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు అడ్డుపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని, కల్యాణమస్తు పథకం కింద సాయం చేయాలని, కొన్నిచోట్ల పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని... వాటిని అడ్డుకోవాలని, వైసీపీ రద్దు చేసిన వికలాంగ పెన్షన్లను పునరుద్ధరించాలని, ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారికి ఉద్యోగ భద్రత కల్పించాలని... ఇలా రకరకాలుగా నారా లోకేశ్ కు విజ్ఞప్తులు అందాయి.