NEET: నీట్ పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాఫ్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- లీకేజీపై త్వరితగతిన దర్యాఫ్తు పూర్తి చేసి నివేదిక సమర్పించేలా చూడాలని పిటిషన్
- నీట్ పరీక్ష నిర్వహణ అవకతవకలతో కూడుకున్నదని పిటిషన్లో ఆరోపణ
- నీట్ పరీక్ష రాసిన 10 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు
నీట్ యూజీ-2024 పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాఫ్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసిన 10 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అవకతవకలపై బీహార్ పోలీసులు త్వరితగతిన దర్యాఫ్తు పూర్తి చేసి, సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని వారు పిటిషన్లో కోరారు. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుతో తలెత్తే పరిణామాల గురించి పూర్తిగా తెలుసునని... కానీ ఇంతకుమించి తమకు ప్రత్యామ్నాయం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
నీట్ పరీక్ష నిర్వహణ పలు అవకతవకలతో కూడుకున్నదని... పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సకాలంలో ప్రశ్నాపత్రాలు అందించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మరికొన్నిచోట్ల తప్పుడు సెట్ ప్రశ్నాపత్రాలు ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో, నీట్ యూజీ 2024 రద్దుతో పాటు కోర్టు పర్యవేక్షణతో దర్యాఫ్తు చేయాలని దాఖలైన పిటిషన్ల మీద అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏలకు సుప్రీంకోర్టు ఇదివరకే నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయబోమని స్పష్టం చేసింది.