T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. సెమీస్ ఆశలు క్లిష్టం!
- గుల్బాదిన్, నవీనుల్ హక్ దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల
- 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 127కే ఆలౌట్
- భారత్‌పై గెలిస్తేనే సెమీస్‌కు ఆస్ట్రేలియా
- హ్యాట్రిక్ నమోదు చేసిన పాట్ కమిన్స్
టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్వితీయమైన ఆటతీరుతో ఇప్పటికే న్యూజిలాండ్‌ను ఇంటికి పంపిన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తేనే ఆ జట్టు సెమీస్‌కు వెళ్తుంది. లేదంటే ఇంటికే.
తాజా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 148 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టుకు ఇది ఊదిపారేసేంత టార్గెట్. కానీ, గుల్బాదిన్ నైబ్, నవీనుల్ హక్ పదునైన బంతుల ముందు ఆసీస్ ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు.
ఖాతా కూడా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయిన కంగారూలు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమికి చేరువయ్యారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ (59)తో రాణించినప్పటికీ జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (12), మార్కస్ స్టోయినిస్ (11) తప్ప జట్టులో మరెవరూ రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారు. ఆఫ్ఘన్ బౌలర్ల దెబ్బకు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 127 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నాలుగు, నవీనుల్ హక్ మూడు వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ల అర్ధ సెంచరీలతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్ (51) పరుగులు చేశారు. కరీమ్ జనత్ 13, నబీ (నాటౌట్) 10 పరుగులు చేశారు. కమిన్స్ 3, ఆడం జంపా 2 వికెట్లు తీసుకున్నారు.
ఆసీస్ స్టార్ పేసర్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించిన కమిన్స్ ఈ మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్ సాధించి టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ఆ రికార్డును అందుకున్న ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
గ్రూప్-1లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తాజాగా ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిన ఆసీస్, విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్ రెండేసి పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ అట్టడుగున ఉంది.