YS Jagan: పులివెందుల కాంట్రాక్టర్లకు మాజీ సీఎం జగన్ భరోసా!
- పాడా కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్యపడొద్దన్న మాజీ సీఎం
- కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని హామీ
- వైసీపీ హయాంలో బిల్లులు సకాలంలో చెల్లించామని గుర్తు చేసిన జగన్
- కాంట్రాక్టర్లు కాస్త ఓపిక పట్టాలని సూచన
పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (పాడా) కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్య పడొద్దని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను ఆదివారం పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్‌చైర్మన్ మనోహర్ రెడ్డి, ఇతర కౌన్సిలర్లు కలిసి బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. నీరు - చెట్టు కింద పని చేసిన టీడీపీ నాయకులకు రూ.250 కోట్ల మేర బిల్లులను వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించినట్లు జగన్ గుర్తు చేశారు. వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బిల్లులు చెల్లించామని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు.
మరోవైపు, ఆదివారం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కార్యాలయ అద్దాలు పగిలి ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. క్యాంపు కార్యాలయానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, కడప డీఎస్పీలు వినోద్‌కుమార్, రవికుమార్, రమాకాంత్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 130 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.