KTR: బీఆర్ఎస్‌ను వీడిన జగిత్యాల ఎమ్మెల్యే.. కేటీఆర్ కీలక కామెంట్
- 2004 నాటి కాంగ్రెస్ హయాంలోనూ పలువురు నేతలు పార్టీని వీడారన్న కేటీఆర్
- ఆ తరువాత ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ తలవంచిందని వ్యాఖ్య
- ఈసారి చరిత్ర పునరావృతం అవుతుందని జోస్యం
బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలు పార్టీని వీడారని అన్నారు. ఆ తరువాత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో కాంగ్రెస్ ప్రజాతీర్పునకు తలవంచాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. చరిత్ర పునరావృతం అవుతుందని, అధికారంలో ఉన్న వారికంటే ప్రజల అధికారమే గొప్పదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అధికారానికి దూరమైన బీఆర్‌ఎస్‌ను కీలక నేతలు వీడుతున్న విషయం తెలిసిందే. కారు దిగిన అనేక మంది కాంగ్రెస్ లేదా బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. కీలక నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తం పార్టీలో చేరారు.