Narendra Modi: డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ... కాంగ్రెస్‌తో విభేదించిన వారిని హింసించారు: మోదీ ట్వీట్
- ఎమర్జెన్సీపై పోరాటం చేసిన వారికి నివాళులు అర్పించే రోజన్న ప్రధాని మోదీ
- ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని విమర్శ
- అధికారం అట్టిపెట్టుకోవడం కోసం ప్రజాస్వామ్య విలువలను విస్మరించారని మండిపాటు
- బలహీనవర్గాలను అణచివేసేందుకు తిరోగమన విధానాలు ఆవిష్కరించారని ఆరోపణ
ఎమర్జెన్సీ రోజులు చీకటి రోజులని... కాంగ్రెస్‌తో విభేదించిన వారిని హింసించారు... వేధించారని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో 25 జూన్ 1975 నుంచి 21 మార్చి 1977 వరకు విధించిన అత్యయికస్థితిపై మోదీ మరోసారి స్పందించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి... ఎదిరించిన వారందరికీ ఈ రోజు నివాళులు అర్పించే రోజు అని పేర్కొన్నారు.
ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, అలాగే ప్రతి భారతీయుడు గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉందని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించారన్నారు. ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు.
ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించిందన్నారు. పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లును తీసుకువచ్చారన్నారు. ఫెడరలిజాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.
బలహీనవర్గాలను అణచివేసేందుకు సామాజికంగా తిరోగమన విధానాలను ఆవిష్కరించారని విమర్శించారు. కేవలం అధికారాన్ని అట్టిపెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం... ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.