Shoaib Akhtar: ఈసారి ప్రపంచకప్ భారత్‌దే: షోయబ్ అక్తర్
- తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ టీమిండియాపై పాక్ మాజీ పేసర్ ప్రశంసలు
- ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని జోస్యం
- ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ శర్మ అన్ని విధాల అర్హుడన్న అక్తర్
అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశ ముగిసింది. దీంతో సెమీస్‌కు చేరే నాలుగు జట్లపై ఉత్కంఠకు తెరపడింది. అయితే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా పసికూన ఆఫ్ఘనిస్థాన్ సెమీ ఫైనల్‌కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్‌పై థ్రిల్లింగ్ విక్టరీతో ఆఫ్ఘన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ బెర్తులు కన్ఫార్మ్ చేసుకున్నాయి. ఇక మొదటి సెమీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుండగా, రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. గురువారం (జూన్ 27న) ఈ రెండు మ్యాచులు జరగనున్నాయి.
ఇదిలాఉంటే.. ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచే జట్టు విషయమై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ గెలిచేందుకు వందకు వంద శాతం అర్హత టీమిండియాకే ఉందన్నాడు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జోస్యం చెప్పాడు. ఇక సూపర్-8లో సెయింట్ లూసియా వేదికగా జరిగిన తన ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 24 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో జూన్ 27న ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
టీమిండియాపై అక్తర్ ప్రశంసల జల్లు..!
తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలో పాక్ మాజీ పేసర్ టీమిండియాపై ముఖ్యంగా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. వన్డే ప్రపంచ కప్-2023 గెలుచుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన భారత్.. టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు వందకు వంద శాతం అర్హత ఉందన్నాడు. టీమిండియా కచ్చితంగా ఈసారి గెలవాలని ఆయన కోరాడు. ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ శర్మ అన్ని విధాల అర్హుడని తెలిపాడు.
"టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ బాగా ఆడుతోంది. ఈ ప్రపంచ కప్ మీదే. మీరు దీన్ని గెలవాలి. అలాగే ప్రపంచ కప్ ఉపఖండంలోనే ఉండాలి. ప్రపంచకప్ గెలిచేందుకు మీరు వంద శాతం అర్హులు. నా మద్దతు మీకు ఉంటుంది. రోహిత్ ట్రోఫీని అందుకోవడానికి పూర్తిగా అర్హుడు" అని అక్తర్ అన్నాడు.
ఇక గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాలనే పట్టుదల భారత్‌కు కలిగిందని అక్తర్ చెప్పుకొచ్చాడు. "భారత్‌ది సమష్టి విజయం. గెలవాల్సిన ప్రపంచకప్‌లో ఓడిపోయిన తర్వాత వారు నిరాశకు లోనయ్యారు. భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం ఆ జట్టును నిరాశ నిస్పృహలకు గురి చేసింది. దాంతో వారు ఈసారి కచ్చితంగా ఆస్ట్రేలియాను ఎదురుదెబ్బ కొట్టాలనుకున్నారు" అని అక్తర్ చెప్పుకొచ్చాడు.