Lok Sabha: మరికాసేపట్లో స్పీకర్ ఎన్నిక.. ఓటింగ్ ఎలా, గెలిచే అవకాశాలు ఎవరికంటే..!
- ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఓం బిర్లా
- ఇండియా కూటమి నుంచి కె. సురేశ్ పోటీ
- లోక్ సభలో ఎన్డీఏ సంఖ్యాబలం దృష్ట్యా బిర్లా గెలుపు లాంఛనమే
లోక్ సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి, అధికార ఎన్డీఏ అలయెన్స్ కు సఖ్యత కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షం ఎన్డీఏ కూటమి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె. సురేశ్ ను బరిలోకి దింపింది. బుధవారం (నేడు) 11 గంటలకు లోక్ సభలో స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. ఇరు కూటములు తమ తమ పార్టీల ఎంపీలకు విప్ జారీ చేశాయి. పార్టీల బలాబలాల దృష్ట్యా స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే అని చెప్పచ్చు. లోక్ సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీలు ఉండగా.. వైసీపీ కూడా మద్దతు పలకడంతో ఓం బిర్లాకు 297 మంది ఎంపీల సంఖ్యాబలం ఉంది. ఇక, ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న కె. సురేశ్ కు 234 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు.
స్పీకర్ పదవికి అర్హతలు..
స్పీకర్ గా పోటీ చేయడానికి లోక్ సభ సభ్యుడు అయితే చాలు.. ఇతరత్రా ప్రత్యేక అర్హతలు ఏమీ అక్కర్లేదు. లోక్ సభ మెంబర్ ఎవరైనా పోటీ చేయొచ్చు.
ఎన్నిక ఎలా..
సభ్యులు రహస్య బ్యాలెట్ ఓటింగ్ ద్వారా స్పీకర్ ను ఎన్నుకుంటారు. సాధారణ మెజారిటీ సరిపోతుంది. పోలైన మొత్తం ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి స్పీకర్ పదవిని చేపడతారు.
రాజ్యాంగం ఏం చెబుతోందంటే..
కొత్త లోక్ సభ కొలువుదీరిన తర్వాత స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే, దీనికి నిర్ణీత కాలవ్యవధి అంటూ ఏదీ రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఆర్టికల్ 93 ప్రకారం.. సభ ఏర్పాటైన తర్వాత సాధ్యమైనంత త్వరగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవాలి.