Frank Duckworth: 'డీఎల్ఎస్' సహ రూపకర్త డక్‌వర్త్ మృతి!
- క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించినప్పుడు వినిపించే మాట 'డక్‌వర్త్ లూయిస్' పద్ధతి
- ఇంగ్లండ్‌కు చెందిన గణాంక నిపుణుడు డక్‌వర్త్
- టోనీ లూయిస్‌తో కలిసి డీఎల్ఎస్ పద్ధతిని రూపొందించిన డక్‌వర్త్
- 1997లో తొలిసారి డీఎల్ఎస్ పద్ధతిని అమలు చేసిన ఐసీసీ
క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించినప్పుడు అభిమానులు తరుచూ వినే మాట 'డక్‌వర్త్ లూయిస్' పద్ధతి. ఈ పద్ధతి ద్వారా లక్ష్యాన్ని, ఓవర్లను కుదించడం జరిగిందని తరచుగా విటుంటాం. అయితే, ఈ డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ మరణించారు. ఈ నెల 21న డక్‌వర్త్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు.
కాగా, 84 ఏళ్ల డక్‌వర్త్ మరణవార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. క్రిక్ఇన్ఫో వెబ్సైట్ మంగళవారం ఆయన మరణవార్తను తెలియజేసింది. ఇంగ్లండ్‌కు చెందిన డక్‌వర్త్ గణాంక నిపుణుడు. ఆయన టోనీ లూయిస్‌తో కలిసి డీఎల్ఎస్ పద్ధతిని రూపొందించారు. వర్షంతో ప్రభావితమయ్యే మ్యాచుల్లో ఫలితం తేలడానికి కుదించాల్సిన ఓవర్లను, ఛేదించాల్సిన లక్ష్యాలను అంచనా వేసేందుకు వారు డక్‌వర్త్ లూయిస్ పేరిట కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
డీఎల్ఎస్ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1997లో తొలిసారిగా అమలు చేసింది. అనంతరం వర్ష ప్రభావిత మ్యాచుల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది.
అయితే, ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి తదనంతరం ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేశారు. దాంతో ఆ తర్వాత ఈ పద్ధతికి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్ఎస్)గా పేరు మార్చడం జరిగింది. కాగా, లూయిస్ 2020లో కన్నుమూశారు.
ఇక ఈ విధానాన్ని కనిపెట్టినందుకు జూన్ 2010లో డక్‌వర్త్, లూయిస్లకు ఎంబీఈ (మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్) అవార్డు పొందారు. డక్‌వర్త్ 2014 వరకు ఐసీసీలో కన్సల్టెంట్ స్టాటిస్టిషియన్‌గా ఉన్నారు.
"ఫ్రాంక్ ఒక అత్యుత్తమ గణాంకవేత్త. ఆయన తీసుకువచ్చిన డీఎల్ఎస్ పద్ధతి క్రికెట్లో అద్భుత ఆవిష్కరణ. మేము దానిని ప్రారంభించిన రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్లో ఉపయోగించడం జరుగుతోంది" అని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) వసీం ఖాన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఆటలో ఫ్రాంక్ సహకారం అపారమైంది. ఆయన మరణం క్రికెట్ ప్రపంచంలో తీరని లోటు. మేము అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము" అని అన్నారు.