Ashok Kumar: ఈ రోజుల్లో ఎవరిని వేషాలు అడగమంటారు? .. ఎలా అడగమంటారు?: నటుడు అశోక్ కుమార్
- సీనియర్ నటుడిగా అశోక్ కుమార్ కి పేరు
- నారద మహర్షి పాత్రలతో పాప్యులర్
- 500కి పైగా సినిమాలు చేసిన నటుడు
- ఇండస్ట్రీలో మారిన పరిస్థితుల పట్ల ఆవేదన
- ఆ రోజులు వేరంటూ అసహనం
అశోక్ కుమార్ .. బుల్లితెరతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన తెలుసు. ఒక వైపున ధారావాహికలు .. మరో వైపున 500లకి పైగా సినిమాలలో నటించారు. ఇక అటు టీవీలలో .. ఇటు సినిమాలలో కూడా నారద మహర్షి పాత్రలలో మెప్పించారాయన. అలాంటి అశోక్ కుమార్ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మా తాత ముత్తాతల కాలం నుంచి మాది హైదరాబాద్. దాదాపు ఇక్కడ మా బంధువుల కుటుంబాలు 300 వరకూ ఉన్నాయి. మా ఫ్యామిలీ చాలా పెద్దది .. అయితే ముందుగా నటనవైపు వచ్చింది నేను మాత్రమే .. నాకు ముందు ఈ ఫీల్డ్ లో ఎవరూ లేరు. నాటకాలలో నటించే ఆసక్తి నన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చింది.
" నేను చెన్నైలో అందరినీ చాలా దగ్గరగా చూసినవాడిని. అప్పట్లో ఎన్టీ రామారావుగారినీ కలవాలన్నా .. నాగేశ్వరరావుగారిని కలవాలన్నా, పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకూ నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎవరినీ వాళ్లు కలవకుండా పంపించేవారు కాదు. అలాగే పెద్దపెద్ద దర్శక నిర్మాతలను కూడా కలిసేవాళ్లం. వాళ్లు ఎంతో ఆత్మీయంగా మాట్లాడి పంపించేవారు" అని అన్నారు.
"ఒకప్పుడు రామారావుగారు .. నాగేశ్వరరావుగారి దగ్గర కూడా మేనేజర్లు .. పీఏలు ఉన్నారు. అయినా ఇండస్ట్రీ వాళ్లు ఎప్పుడైనా సరే నేరుగా కలిసే వీలుండేది. కానీ ఇప్పటి హీరోలను అలా కలవడానికి అవకాశం లేదు. ఒక ఆర్టిస్ట్ కొన్ని రోజులుగా కనిపించకపోతే, మిగతా ఆర్టిస్టుల మంతా కలిసి అతనికి కాల్ చేసి పరిస్థితి కనుక్కునేవాళ్లం. వేషాలు లేవంటే ఇప్పించేవాళ్లం. కానీ ఈ రోజుల్లో ఒక హీరోని .. దర్శకుడిని .. నిర్మాతను .. ఎవరినీ కలవలేం .. కలిసే అవకాశమే లేదు .. ఇక ఎవరిని వేషాలు అడగాలి? ఎలా అడగాలి?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.