T20 World Cup 2024: సెమీస్‌లో పేకమేడలా కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. దక్షిణాఫ్రికా ముందు ఈజీ టార్గెట్
- కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్థాన్
- చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు
- కేవలం 10 ఓవర్లలోనే చాపచుట్టేసిన ఆఫ్ఘన్ బ్యాటర్లు
చారిత్రాత్మక రీతిలో టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీ ఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్థాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. 10 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్ అయింది. కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. పేసర్ మార్కో యన్సెన్, స్పిన్నర్ షంషీ చెరో 3 వికెట్లు తీయగా.. పేసర్లు కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 2, గుల్బాదిన్ నబీ 9, మహమ్మద్ నబీ 0, నంగేయలియా ఖరోటే 2, కరీం జనత్, రషీద్ ఖాన్ 8, నూర్ అహ్మద్ 0, నవీన్ ఉల్ హక్ 2, ఫరూఖీ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా టార్గెట్ కేవలం 57 పరుగులు మాత్రమే కావడంతో ఆ జట్టు ఫైనల్ చేరుకోవడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆఫ్ఘనిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం లేదనే చెప్పాలి.