Revanth Reddy: ఒంటె పెదాల కోసం కాసుక్కూచున్న గుంట నక్కలు.. ఎట్టకేలకు జీవన్‌రెడ్డి అంశంపై పెదవి విప్పిన రేవంత్‌రెడ్డి
- జీవన్‌రెడ్డి మనస్తాపం చెందడంలో అర్థం ఉందన్న రేవంత్‌రెడ్డి
- శ్రీధర్‌బాబు చొరవతో సమస్య పరిష్కారమైందని కితాబు
- జీవన్‌రెడ్డి విషయంలో ఏదైనా జరిగితే బాగుండునని ఎదురుచూశారన్న రేవంత్
- ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని హామీ
- ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు పెదవి విప్పారు. డాక్టర్ సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చున్న తర్వాత జరిగిన పరిణామాలు, జీవన్‌రెడ్డి అలక వంటి విషయాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ విషయంలో జీవన్‌రెడ్డి మనస్తాపానికి గురైన విషయం వాస్తవమేనని, తమవైపు నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రేవంత్ చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారని తెలిపారు. జీవన్‌రెడ్డి అనుభవం, పార్టీపై ఆయనకున్న కమిట్మెంట్ను గుర్తించిన అధిష్ఠానం, ఆయన గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చెప్పారు.
జీవన్‌రెడ్డ తన అనుభవాన్ని ఉపయోగించి ఇకపై రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని పేర్కొన్నారు. జీవన్‌రెడ్డి విషయంలో గోతికాడి నక్కలు కొన్ని ప్రభుత్వానికి, పార్టీకి ఏదైనా జరిగితే బాగుండునని ఎదురుచూశాయని విమర్శించారు. ఒంటె పెదాలకు నక్కలు ఆశపడినట్టు గుంటనక్కలు పాపం బాగా ఎదురుచూశాయని ఎద్దేవా చేశారు. అయితే, జీవన్‌రెడ్డి వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పారు. జీవన్‌రెడ్డి, ఆయన అనుచరులు, కార్యకర్తలు, సహచరులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఫాంహౌస్‌లో పడుకోవడానికి నేను కేసీఆర్‌ను కాను
మంత్రి పదవుల విస్తరణ, కొన్ని శాఖలకు మంత్రులు లేరన్న విలేకరుల ప్రశ్నకు రేవంత్ బదులిస్తూ.. ఏ శాఖా ఖాళీగా లేదన్నారు. విద్యాశాఖకు తానే ఫుల్‌టైం మినిస్టర్‌నని చెప్పుకొచ్చారు. ఫాంహౌస్‌లో పడుకుని పాలించేందుకు తాను కేసీఆర్‌ను కానని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలు నిర్వహించే పేపర్లు, టీవీ చానళ్లు వారి ప్రయోజనాల కోసం తప్పుడు వార్తలు రాస్తాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
నెల రోజులపాటు మంత్రులే లేకున్నా ఎవరూ ప్రశ్నించలేదు
కేసీఆర 2019లో ముఖ్యమంత్రి అయ్యాక నెల రోజులపాటు రాష్ట్రానికి మంత్రులే లేరని, ఆ రోజు ఎందుకిలా? అని ఒక్కరు కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. రాజకీయ పార్టీల పేపర్లు, టీవీ చానళ్లలో పడి ఎవరూ కొట్టుకుపోవద్దని, రాష్ట్ర పాలనను, శాఖలను ఇతర రాష్ట్రాలో పోల్చి చూసి చెప్పాలని కోరారు.
మాలాగా ఎవరన్నా కలిశారా?
తాము అధికారం చేపట్టాక కేంద్రంలోని మంత్రులను కలిసినట్టు ఏ రాష్ట్రం వారైనా కలిశారా? కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, సీఎంలు అయినా కలిశారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కినమెట్టు ఎక్కకుండా కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఏకకాలంలో రూ. 31 వేల కోట్ల రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
బీఆర్ఎస్ కూడా ఫిర్యాదు చేయలేకపోయింది
తాము అధికారంలోకి వచ్చాక జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిన్న ఘటన కూడా జరగలేదని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అదే పొరుగు రాష్ట్రం ఏపీలో ఎన్నికల తర్వాత 40, 50 మంది అధికారులను తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చివరికు బీఆర్ఎస్ కూడా తమపై ఫిర్యాదు చేయలేకపోయిందని పేర్కొన్నారు. పాలనను సమర్థంగా నిర్వహించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని మతాల పండుగలు బ్రహ్మాండంగా జరిగాయని, మతపరమైన ఘటన ఎక్కడా చిన్నది కూడా జరగలేదని గుర్తు చేశారు. అంతేకాదు, ఒక్క రాజకీయ ప్రేరేపిత కేసు కూడా పెట్టలేదని పేర్కొన్నారు. దీనిని బట్టి పాలన బాగున్నట్టా? బాగా లేనట్టా? అన్నది చెప్పాలని ప్రశ్నించారు.
సిగ్గు వదిలేసిన కేసీఆర్‌కు మతికూడా పోయింది
ఫిరాయింపుల విషయంలో గగ్గోలు పెడుతున్న కేసీఆర్ సిగ్గు వదిలేయడంతోపాటు ఆయనకు మతి కూడా పోయిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఫిరాయింపులకు పునాదులు వేసింది ఎవరని ప్రశ్నించారు. 61 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను లాగేసుకున్న కేసీఆర్ ఇప్పుడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పాపాలకు కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ల ముక్కు మూడు అంగుళాలు అరిగిపోయేట్టు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేసింది వీళ్లు కాదా?
ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వం పడిపోతుందని, వంద రోజులు కూడా ఉండదని ప్రచారం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్, హరీశ్ వంతపాడారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వం పడిపోతుందని రోడ్లమీదకు వచ్చి రంకెలేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చేతబడి చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వాడిని చూస్తూ కూర్చొంటామా? చెట్టుకు కట్టేసి బడిత పూజ చేయమా? అని ప్రశ్నించారు. 17 లోక్‌సభ సీట్లలోనూ ఓడిపోయి, 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయి, 14 చోట్ల మూడో స్థానంలో నిలిచాక కూడా కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదని దుమ్మెత్తి పోశారు. తమకు ఓట్లేయకపోవడం ప్రజల తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం సీట్లు బీఆర్ఎస్కు వస్తే లోక్‌సభ ఎన్నికల్లో 16 శాతానికి పడిపోయాయని అన్నారు.
కేటీఆర్ నియోజకవర్గంలో బీజేపీకి ఫస్ట్ ప్లేస్
లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో ఎక్కడైనా బీజేపీకి ఫస్ట్ ప్లేస్ వస్తుందా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిని బట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఎంతగా కలిసి పనిచేశాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సిద్దిపేటలో బీజేపీ, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయని, బీఆర్ఎస్ కంచుకోట మెదక్‌లో ఆ పార్టీకి థర్డ్ ప్లేస్ వచ్చిందని, కాబట్టి కేసీఆర్‌కు ఇకనైనా కనువిప్పు కలిగితే మంచిదని హితవు పలికారు. మొన్నటి వరకు ఎమ్మెల్యేలను గేట్లు కూడా తాకనియ్యని కేసీఆర్.. ఇప్పుడు ఇంటికి పిలిచి భోజనాలు పెట్టే స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. తలుపులు మూసి కాళ్లు పట్టుకుంటున్నారో, కడుపులో తలకాయ పెడుతున్నారో తనకు తెలియదని సెటైర్ వేశారు.