KCR: ఆ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్... విచారణ వాయిదా
- విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను వేసిన ప్రభుత్వం
- కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
- నోటీసులపై కేసీఆర్ సమాధానం ఇవ్వకముందే ప్రెస్ మీట్ పెట్టారన్న లాయర్
విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను వేసింది. దీనిని రద్దు చేయాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లారు.
నేటి విచారణ అనంతరం కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ... విద్యుత్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్మీట్ పెట్టి ఏకపక్షంగా వివరాలు వెల్లడించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమన్నారు.
విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని... అయితే ఆయన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో కొంత గడువు కోరినట్లు చెప్పారు. నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తీవ్ర విద్యుత్ సమస్య ఉందన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తర్వాతే విద్యుత్ కొనుగోళ్లు జరిగినట్లు చెప్పారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జ్యుడీషియరీ సంస్థనే అన్నారు. దేశంలో ఎన్నో పవర్ ప్లాంట్లను భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల పద్ధతిలో నిర్మించారని... కానీ ఇక్కడ లోపాలు ఉన్నట్లు కమిషన్ చెబుతోందన్నారు.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలపై ప్రత్యేకంగా కమిషన్ వేయకూడదని తెలిసినా ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. కేసీఆర్ సమాధానం ఇవ్వకముందే విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తప్పు జరిగినట్లు జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారన్నారు.