Navaneet Rana: 'జై పాలస్తీనా' నినాదం వివాదం... అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి నవనీత్ రాణా లేఖ
- ప్రమాణం సందర్భంగా జై పాలస్తీనా అని నినదించిన అసదుద్దీన్
- భారత్‌కు బదులు మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని లేఖలో పేర్కొన్న నవనీత్ రాణా
- రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలతో ఒవైసీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి
లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా 'జై పాలస్తీనా' అని నినదించిన హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో పాలస్తీనా పేరును లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తన డిమాండ్‌కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఈ సందర్భంగా ఆమె ఉదాహరించారు. ఈ ప్రకరణలు ఒవైసీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఉపకరిస్తాయన్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు... ఎంపీలుగా ప్రమాణం చేశారు. ప్రమాణం సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ... జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ స్పందిస్తూ... ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.