CS Jawahar Reddy: ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి మళ్లీ పోస్టింగ్!
- జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్‌లు జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య
- త్వరలో ఇద్దరూ రిటైర్ కానుండటంతో వారిని గౌరవంగా సాగనంపేందుకు మళ్లీ పోస్టింగులు
- జవహర్ రెడ్డికి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యలకు టీడీపీ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చింది. త్వరలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు పోస్టింగులు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, నిరీక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య అప్పటి సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు.
ఇదిలా ఉంటే, ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్‌ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను ఏపీ కేడర్‌కు తీసుకొచ్చారు. ఆయనకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు. ఆయన్ను రిలీవ్ చేయాలని ఆదేశించారు.