Umpires: టీమిండియా-దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్లు వీళ్లే!
- జూన్ 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- కప్ కోసం టీమిండియా, దక్షిణాఫ్రికా అమీతుమీ
- మైదానంలో అంపైర్లుగా క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్
- మూడో అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు (జూన్ 29) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ అంతిమసమరం ప్రారంభం కానుంది. బార్బడోస్ లోని బ్రిడ్జిటౌన్ లో ఉన్న కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం ఈ టైటిల్ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది.
తాజాగా, ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ మైదానంలో అంపైర్లుగా వ్యవహరిస్తారని, థర్డ్ అంపైర్ గా రిచర్డ్ కెటిల్ బరో, ఫోర్త్ అంపైర్ గా రాడ్నీ టకర్ వ్యవహరిస్తారని ఐసీసీ వెల్లడించింది.
కాగా, రిచర్డ్ కెటిల్ బరోను మైదానంలో కాకుండా మూడో అంపైర్ గా నియమించడం పట్ల టీమిండియా ఫ్యాన్స్ లో హర్షం వ్యక్తమవుతోంది.
రిచర్డ్ కెటిల్ బరో మైదానంలో అంపైర్ గా వ్యవహరించిన సమయంలో భారత్ పలు వివాదాస్పద నిర్ణయాలను ఎదుర్కొందని, పలు మేజర్ టోర్నమెంట్లలో భారత్ ఓటమికి కెటిల్ బరో పరోక్ష కారకుడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అతడు మైదానంలో లేకపోవడం టీమిండియాకు లాభించే అంశమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.