Car Accident: ఎక్స్ ప్రెస్ వే పైకి రాంగ్ రూట్ లో ప్రవేశం.. రెండు కార్ల ఢీ.. ఆరుగురి మృతి
- ముంబై- నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం
- రెండు కార్లు ఢీ.. నుజ్జునుజ్జుగా మారిన ఎర్టిగా కారు
- రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు
ఒక చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి రావొచ్చనే మాట పెడచెవిన పెట్టాడో డ్రైవర్.. ఎక్స్ ప్రెస్ వే పైకి కారుతో రాంగ్ రూట్ లో వెళ్లాడు. దీంతో రెండు కార్లు ఢీ కొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని ముంబై- నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వే పై శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో చోటుచేసుకుందీ దారుణం. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జాల్నా జిల్లాలోని కద్ వాంచీ గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అక్కడున్న ఓ పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకున్న స్విఫ్ట్ డిజైర్ కారు ముంబైకి వెళ్లేందుకు సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కింది. అయితే, డ్రైవర్ నిర్లక్ష్యంతో రాంగ్ రూట్ లో హైవేపైకి ఎంటరయ్యాడు. ఆరు లేన్ల ఈ హైవేపై ముంబై నుంచి నాగ్ పూర్ వెళుతున్న ఎర్టిగా కారు ఈ కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో రెండు కార్లలో కూర్చున్న వాళ్లు ఎగిరి రోడ్డుపై పడ్డారు.
ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఎక్స్ ప్రెస్ వే పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో పడి ఉన్న నలుగురిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు క్రేన్ సాయంతో రెండు కార్లను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.