Mahasena Rajesh: సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మహాసేన రాజేశ్... ఎందుకంటే...!
- పెద్దాపురం కోర్టుకు హాజరైన మహాసేన రాజేశ్
- రాజేశ్ పై మూడు కేసుల కొట్టివేత
- చంద్రబాబు రాగానే దుష్టశక్తులన్నీ పరార్ అంటూ వ్యాఖ్యలు
- నిజం వచ్చాక అబద్ధం పటాపంచలైపోతుందని వెల్లడి
ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తొలి జాబితాలో టికెట్ దక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన వ్యక్తి మహాసేన రాజేశ్. తాజాగా, మహాసేన రాజేశ్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పెద్దాపురంలో కోర్టు విచారణ అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"అందరికీ జై భీమ్... నేను రాజేశ్ మహాసేన. ఏవండీ... సూర్యుడు రాగానే చీకటంతా మాయమైపోతుంది. అలాగే... దేవుడు రాగానే దుష్టశక్తులన్నీ పారిపోతాయి. సేమ్ టు సేమ్... ఇక్కడ నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే... మా మీద జగన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి.
నా మీద పెట్టిన కేసుల్లో ఇవాళ ఒక్కరోజే పెద్దాపురం కోర్టులో మూడు కేసులు కొట్టేశారు. ఆ కేసులు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో... వారికి కనీసం కేసు పెట్టిన సంగతి కూడా తెలియదంట. వాళ్ల ఇళ్లకు వెళ్లి సంతకాలు తీసుకుని, ఎఫ్ఐఆర్ లు రూపొందించి కోర్టుకు పంపించేశారు.
నన్ను అరెస్ట్ చేసింది కూడా ఈ పెద్దాపురం కేసుల్లోనే. ఈ కేసుల్లోనే నాపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ కేసులు పెట్టిన సంగతి కూడా తమకు తెలియదని అవతలి పక్షం వారు చెప్పడంతో కోర్టు ఆ కేసులు కొట్టివేసింది. నారా చంద్రబాబునాయుడి గారి గొప్పతనం ఇది. ఎప్పుడైనా నిజం వచ్చిందంటే అబద్ధం పటాపంచలైపోతుందనడానికి మొట్టమొదటి నిదర్శనం ఇది.
నా మీద 30 కేసులు పెట్టారు. వాటిలో ఏడెనిమిది కేసులు... కేసులు పెట్టిన వాళ్లకు కూడా తెలియకపోవడంతో, వాళ్లే వచ్చి కేసులు ఉపసంహరించుకుంటున్నారు. మిగతా కేసులు కూడా తొందర్లోనే పోతాయి. దీనికి మొట్టమొదటగా నారా చంద్రబాబునాయుడి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, పోలీసులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ మహాసేన రాజేశ్ పేర్కొన్నారు.