YS Avinash Reddy: పులివెందులలో మున్సిపల్ కౌన్సిలర్లతో ఎంపీ అవినాశ్ రెడ్డి కీలక సమావేశం!

MP Avinash Reddy held meeting with Pulivendula councillors
  • పులివెందుల కౌన్సిలర్లు వైసీపీపై అసమ్మతితో ఉన్నారంటూ ప్రచారం
  • అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రావడంలేదని కౌన్సిలర్ల అసంతృప్తి
  • కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
  • ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచిచూద్దామని సూచన
  • అవసరమైతే కోర్టుకు వెళదామని వెల్లడి
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నేడు పులివెందులలో మున్సిపల్ కౌన్సిలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ పట్ల అసమ్మతితో ఉన్నారన్న సమాచారంతో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 

పులివెందుల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రావడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను అవినాశ్ రెడ్డి ఈ సమావేశం ద్వారా బుజ్జగించే ప్రయత్నం చేశారు. పాడా కింద చేసిన రూ.250 కోట్ల అభివృద్ధి పనుల నిధులు నిలిచిపోవడంతో కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు డబ్బులు ఎవరు చెల్లిస్తారని వారు ఈ సమావేశంలో ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు. 

ఇటీవల జగన్ పులివెందులకు వచ్చిన సమయంలోనూ కౌన్సిలర్లు ఇదే అంశాన్ని ఆయన ఎదుట ప్రస్తావించారు. ఇవాళ్టి సమావేశంలోనూ కౌన్సిలర్లు బిల్లుల విషయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసేవరకు వేచి చూద్దామని అవినాశ్ రెడ్డి కౌన్సిలర్లకు సూచించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి బిల్లులు మంజూరు చేయించుకుందామని అన్నారు. జగనన్న మనకు అండగా ఉన్నారు... మనం పార్టీని అంటిపెట్టుకుని ఉండాలి అని వారికి పిలుపునిచ్చారు.
YS Avinash Reddy
Councillors
Pulivendula
YSRCP
Kadapa District

More Telugu News