Thummala: భద్రాచలం-ఏటూరు నాగారం 4 లైన్ హైవేకు ప్రతిపాదనలు చేశాం: మంత్రి తుమ్మల
- విజయవాడ-జగదల్పూర్ హైవే విషయంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడి
- ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడి
- భద్రాచలం పట్టణంలో కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందన్న మంత్రి
భద్రాచలం-ఏటూరు నాగారం 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ-జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరినట్లు చెప్పారు.
ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించలేకపోవడంతో రింగ్ రోడ్డు పక్కన పడిందన్నారు. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందన్నారు. జగ్గయ్యపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 లైన్ల హైవేకు ప్రతిపాదనలు పంపించామన్నారు.