YS Sharmila: పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ, వైసీపీలే: షర్మిల
- పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- పంతాలకు పట్టింపులకు పోయి రాజకీయ దాడులతో పోలవరంను నాశనం చేశారన్న షర్మిల
- మోదీ సర్కారు పోలవరంపై సవతి తల్లి ప్రేమ చూపిందన్న షర్మిల
- చంద్రబాబు ఇకనైనా పోలవరం పూర్తి చేయాలని డిమాండ్
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన బాణీ వినిపించారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు... పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ, వైసీపీలే అని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మించి 28 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయం అయితే... పంతాలు, పట్టింపులకు పోయి జీవనాడి పోలవరంపై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్ప మరొకటి కాదని షర్మిల విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిందని, కానీ మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపించిందని, జాతీయ హోదా బాధ్యతను విస్మరించి పదేళ్ల పాటు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.
"కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తానే కడతానని చెప్పి, పోలవరం సోమవారం అంటూ హడావిడి చేయడం తప్ప బాబు మొదటి ఐదేళ్లలో చేసింది శూన్యం. రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రూ.10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం ఖరీదు రూ.76 వేల కోట్లు!
ప్రాజెక్టు కట్టాలంటే మరో ఐదేళ్లు పడుతుందని చెబుతున్న సీఎం చంద్రబాబు గారూ... ఇప్పుడు మోదీ పిలక మీ చేతుల్లోనే ఉంది, కేంద్రాన్ని శాసించే అధికారం మీ దగ్గరుంది... కాబట్టి, రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా పూర్తిస్థాయిలో నిధులు తీసుకువచ్చి పోలవరం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది" అంటూ షర్మిల పేర్కొన్నారు.