Sabitha Indra Reddy: రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: సబితా ఇంద్రారెడ్డి
- అభివృద్ధి కోసం కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చేవారని వ్యాఖ్య
- ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
- ఇటీవలి వర్షానికి రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్న మాజీ మంత్రి
నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చేవారని... రేవంత్ రెడ్డి కూడా కక్ష సాధింపు చర్యలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఆమె పర్యటించారు. రోడ్ల పరిస్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని ఎమ్మెల్యేకు స్థానికులు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శివారు మున్సిపాలిటీలలో వెలుస్తున్న కొత్త కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ముఖ్యమంత్రి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిధులను విడుదల చేయాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధులు అవసరమన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారులన్నింటికీ మరమ్మతులు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.